Friday, February 2, 2007

వేమన విశేష సంచిక: మరోచూపు


యోగి వేమన విశ్వ విద్యాలయం, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం సంయుక్త ఆధ్వర్యవంలో జనవరి 27, 28 తేదీలలో జరిగిన జాతీయ సదస్సు వేమనపై మరింత పరిశోధన జరగవలసిన అవసరాన్ని తెలియ జెప్పింది. రెండు రోజుల జాతీయ సదస్సులో దాదాపు 90 పరిశొధన పత్రాలలోని అంశాలు చర్చకు వచ్చాయి. వీటిలో 76 పత్రాల సంక్షిప్త రూపాలు విశేష సంచికలో చేరాయి. సదస్సులో పాల్గొన్న వారందరికీ ఈ సంచికను ఉచితంగా అందించారు నిర్వాహకులు.


ఆహూతులందరి ఆతిధ్య బాధ్యతను విద్వాన్ కట్టా నరసింహులుగారు భుజానికెత్తుకొన్నారు. భోజన సౌకర్యం లయన్ పి. ఖాసింఖాన్ గారు(ఆడిటర్, కడప)కల్పించారు. అతిధులంతా తమ తమ సొంత ఇళ్ళలో , ఊళ్ళలో పొందే అభిమానాన్ని, ఆత్మీయతను పంచారు - యోగి వేమన విశ్వ విద్యాలయం విద్యార్థులు, అధ్యాపక మిత్రులు.


సదస్సు పత్రాలలో చాలాభాగం తెలుగు భాషలో వెలువడినా- కన్నడ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో వెలువడిన పత్రాలుకూడా ఉండటం ఈ సదస్సులో మరొక ఆకర్షణ.


విశేష సంచికలో వచ్చిన 76 వ్యాసాలను (1)వేమన భాషా సాహిత్యం, (2)మహిళలపట్ల వేమన, (3)తులనాత్మక పరిశీలన, (4)సమాజ పరివర్తన, (5)తాత్విక ధోరణులు అన్న ఐదు విభాగాలుగా విభజించి ప్రచురించారు నిర్వాహకులు. సూక్ష్మ దృష్టితో వివేచిస్తే వీటిలో మరిన్ని ఉపవిభాగాలు సాధించే వీలు ఉంది.


ఈ విశేష సంచికలో ఆచార్య ఆర్వీయస్. సుందరం, ఆచార్య టి.ఎస్.గిరిప్రకాష్, డా. జానమద్ది హనుమచ్చాస్త్రి, డా. తక్కోలు మాచిరెడ్డి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి,... వంటి విశిష్ట సాహితీపరుల పత్రాలున్నాయి. వీటితోపాటు, ఆంధ్ర, ఆంధ్రేతర రాష్ట్రాలలో తెలుగు అధ్యయన, అధ్యాపనాలలో ఉన్న విద్యార్థుల, పరిశొధకుల, ఆచార్యుల వ్యాసాలున్నాయి.
ఈ సంచికలో జారిపోయి సదస్సులో సమర్పించబడ్డ పత్రాలూ, చర్చలూ, వాదాలూ అన్నీ కలుపుకొంటే వేమనపై ఇంకా చాలా పరిశొధన జరగవల్సి ఉందన్నది స్పస్టమవుతుంది.


వేమనను కవిగా, ప్రజాకవిగా, తత్వకవిగా, యోగిగా... ఇంకా చాలారకాలుగా నిరూపించే ప్రయత్నం చేసిన పత్రాలూ ఇందులో ఉన్నాయి. (ఇటువంటి "పరిశొధన" మందే చాలా జరిగింది)


చెప్పొచ్చేదేమిటంటే; ఈ విశెష సంచిక చూసిన తర్వాతా, సదస్సులో ఆసాంతం పాల్గొన్న తర్వాతా వేమన్ను గురించిన మౌలికాంశాలపై చర్చ సమగ్రం కాలెదనే అనిపిస్తోది.


వేమన కవా? వేమన స్వయంగా పద్యాలను రాశాడా? రాయించాడా? ఆయన చెప్పిన పద్యాలుగా లోకంలో ఉన్న పద్యాలన్నిటికీ కర్త ఆయనేనా? వేమన పద్యాలను మొదట సంకలనం చేసింది ఎవరు? సంకలన కర్తలు ఎందరు? అన్ని సంకలనాలలోనూ పద్యాలు ఒకేలా ఉన్నాయా? పాఠ భేదాలు ఎటువంటివి? అవి ఎటువంటి అర్థ భేదాలు కలిగిస్తున్నాయి? పరిషృత ప్రతుల అవసరం లేదా? ఉంటే - వాటి నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక ఏది? ఎలాఉండాలి? ... వంటి మౌలికాంశాలమీద తగినంత చర్చ జరగలేదు.


ఉదాహరణకు; వేమన తాత్విక ధోరణులపై పత్ర సమర్పకులందరి ఆలోచనా ధార ఒకేలా సాగింది. సంచికలో ప్రచురించిన సంక్షిప్తులలొకూడా ఏకాంశ పునరుక్తే కనిపిస్తుంది (పుటలు 103-133).


తులనాత్మక పత్ర సమర్పకులు వేమనను మరిన్ని కొత్త దృక్కోణాలనుంచి చూపే ప్రయత్నం చేశారు. తిరువళ్ళువర్, సర్వఙ్ఞుడు, కబీరు, అల్లీసాహెబు, బసవన, శివప్ప, గురజాడ...వంటి విశిష్ట వ్యక్తి పరంపర ప్రవచనాలతో పోల్చి చూపడం ఒక ఎత్తైతే, వేమన బోధనలను భగవద్గీతతో పోల్చి చూపడం తులునాత్మక అధ్యయనంలో మరోకోణం.
వేమన భాషా సాహిత్యాలపై (నలుగురైదుగురు మినహా) పత్రసమర్పకులు సొంతంగా సాధించిందేమీ లేదు. పూర్వ పరిశోధకుల ఫలితాంశాల పునరుక్తే ఈ పత్రాలలోనూ ఉంది.


"మహిళల పట్ల వేమన", "సమాజ పరివర్తనం" అన్న అంశాలలో పత్రాలు సమర్పించినవారంతా ఎవరి వాదనా పటిమకు అనుకూలంగా వారు వేమనను, బొధలను వ్యాఖ్యానించడం కనిపిస్తుంది. కాలాన్ని, ప్రాంతాన్ని ఊహించడం, సమాజ స్థితిగతులను వాటితో కలుపుకొని అవలోకించే ప్రయత్నం చేయడం...వంటి ప్రాధమిక అంశాలను మరిచిపోయిన పత్రసమర్పకులూ ఉన్నారు.


విశ్వవిద్యాలయాల స్థాయిలో- నాకు తెలిసి, వేమనపై నిర్వహించిన సదస్సులలో ఈ సదస్సు మూడోది. వేమనపైనా, బొధలపైనా బహుకోణీయ దృష్టితో మరింత పరిశొధన జరగవలసిన అవసరాన్ని తాజాగా ఈ సదస్సు నిరూపించింది. కాబట్టి, వేమనపై పరిశొధనకు ఈ సదస్సు ఆరంభంగాను, ఇంతకుముందు జరిగిన పరిశోధన ఈ ఆరంభానికి ప్రాతిపదికగాను స్వీకరించడంవల్ల జరిగే మేలు అధికం.

3 comments:

spandana said...

సదస్సుకు హాజరు కాలేని మాలాంటి వారికి మంచి వివరాలు అందించారు.

--ప్రసాద్
http;//blog.charasala.com

రానారె said...

అయ్యా ఎర్రరంగులో తెల్లని అక్షరాలను చదవడం చాలా ఇబ్బందిగా వుంది. సగం చదివేటప్పటికి నా కళ్లు 'ఇంక ఆపెయ్యడం మంచిది' అన్నాయి. దయచేసి ...

Anonymous said...

అయ్యా మీ బ్లాగు చదవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా చూడ ముచ్చటగా ఉంది.మీరు పెట్టిన పేరు అద్భుతం. ప్రభాస...ప్రజలు,భాష,సంస్కృతి ఎంత బాగా సృష్టించారండి. మీ ఆలోచనకు జోహార్లు.

పాఠకులు అంతగా వేడుకుంటున్నారు కాబట్టి మీ రంగు, అదే "ఎరుపు"ను మార్చే ప్రయత్నం చేయండి.ఒకవేళ ఆ రంగుకు కూడా ఏదైనా అర్థం ఉంటే యిక ఎవరేమీ చేయలేరు.

మీ వ్యాసం ఆసాంతం చదివాను.బాగా రాసారు.

మీరు లెక్చరర్ అని చెప్పారు కానీ ఎక్కడ చేస్తున్నారు లాంటి వివరాలు తెలపలేదు.ఏదేమైనా మీలాంటి సాహితీ వేత్తలు బ్లాగుల్లోకి ప్రవేశించడం తెలుగు ప్రజల భాషా సంస్కృతులకు శుభపరిణామం.